: ఎట్టకేలకు అంజాద్ అలీఖాన్‌కు బ్రిటన్ వీసా వచ్చేసింది.. వచ్చేనెల లండన్ లో ప్రదర్శనకు సరోద్ మాస్ట్రో రెడీ!
ప్రముఖ సరోద్ విద్వాంసుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఉస్తాద్ అంజాద్ అలీఖాన్ (70) వీసా దరఖాస్తును ఇటీవలే బ్రిటన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. అసంపూర్ణ సమాచారం అందించారనే కారణంతో ఆయన వీసా దరఖాస్తు తిరస్కరణకు గురయింది. అయితే తాజాగా ఆయనకు బ్రిటన్ వీసా మంజూరు చేసింది. కొన్ని రోజుల క్రితం ఆయన ట్విట్టర్‌లో తన వీసా దరఖాస్తును తోసిపుచ్చారని, గతంలో ఎన్నడూ తనకు ఇలాంటిది జరగలేదని కళాకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్ తో పాటు బ్రిటన్‌లో భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించింది. వీసా అంశాన్ని ఇండియాలోని బ్రిటన్ ఎంబసీ దృష్టికి ఈ అంశం చేరింది. దీంతో ఎట్టకేలకు బ్రిటన్ రాయబార కార్యాలయం నుంచి సమాధానం వచ్చింది. ఉస్తాద్ అంజాద్ అలీఖాన్ చేసుకున్న దరఖాస్తు గురించి పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో చివరకు ఆయనకు బ్రిటన్ వీసా మంజూరు చేసింది. తనకు ఎట్టకేలకు బ్రిటన్ వీసా రావడంపై ఉస్తాద్ అలీఖాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశంలో తన పట్ల సానుకూలంగా వ్యవహరించిన వారికి ధన్యావాదాలు తెలిపారు. ఇక తాను ముందుగా ప్రకటించినట్లే వచ్చేనెల లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో ప్రదర్శన ఇస్తానని పేర్కొన్నారు.