: సింధు సంస్కారానికి గుణ్ణం గంగరాజు నమస్కారం!
పీవీ సింధు స్పోర్టివ్ స్పిరిట్ కు ప్రముఖ దర్శక నిర్మాత 'లిటిల్ సోల్జర్స్' ఫేమ్ గుణ్ణం గంగరాజు ముగ్ధులయ్యారు. సింధులో క్రీడా స్పూర్తికి అచ్చెరువొందిన ఆయన, దానిని నేర్పిన ఆమె తల్లిదండ్రులు, గురువుకి నమస్కరించారు. "రెండు నిమిషాలు బాధ కలిగుండొచ్చు, ఆశించినది చేతికి రాలేదని. భారతీయులందరికీ. తెలుగువాళ్లకి ఇంకొంచం ఎక్కువగా వుండొచ్చు. టీవీ ముందు అలా కూర్చుండిపోయి వుండొచ్చు. కాని సింధుకి అంత సమయం కూడా పట్టలేదు, కోలుకోవటానికి. నెట్ అవతలి పక్కకు వెళ్లింది. అక్కడ నేల మీద బోర్లా పడుకుని ఇప్పటివరకు ఏ యూరోపియన్ అమ్మాయికి దక్కని బంగారు పతకం దక్కిన ఆనందంతో కన్నీళ్లు కారుస్తున్న కరోలినా మారిన్ ని పైకి లేపి హత్తుకుంది. ఇది, తన పైన నెగ్గిన వారికి సింధు చూపిన గౌరవం, ఆప్యాయత. మారిన్ వెంటనే సింధుని కౌగిలించుకొని ఆ విజయోత్సాహంలో తన కోచ్ ల వద్దకు వెళ్లిపోయింది, తన రాకెట్ కోర్ట్ మీద మర్చిపోయి. సింధు ఆ రాకెట్ తీసి, మారిన్ కిట్ బేగ్ దగ్గర పెట్టి, ఆ తర్వాత తన గురువు దగ్గరకు వెళ్లింది. ఇదీ సంస్కారం. ఇదీ బంగారం. తల్లిదండ్రుల పెంపకం, గురువుల శిక్షణతో వచ్చేదిది. గవర్నమెంటు సంబరాలతో, శాసనాలతో ఉప్పొంగేది కాదు. సింధు ఏ దేశానిదో, ఏ రాష్ట్రానిదో అన్నది అనవసరం. ఇలాంటి బంగారం ఒకటుంది. ప్రపంచంలో దానిని మలచిన రమణ, విజయలక్ష్మిలకు, గురువు గోపిచంద్ కు నమస్కరిద్దాం" అని గంగరాజు తన స్పందనను తెలిపారు.