: అంచనాలు లేవు...ఆశల్లేవు...ఒలింపిక్స్ లో దేశానికి మరో పతకం అందించేందుకు ఆడుతున్న అదితి!
రియో ఒలింపిక్స్ లో ఆశలు, అంచనాలు లేని యువ క్రీడాకారిణి భారత్ కు మరో పతకం తెచ్చేదిశగా అడుగులు వేస్తోంది. ఒలింపిక్స్ లో ఇప్పటికే పీవీ సింధు, సాక్షీ మెడల్స్ సాధించి దేశ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడింప చేసిన సంగతి తెలిసిందే. ఇదే జాబితాలో చేరేందుకు 18 ఏళ్ల యువ గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గత మూడురోజులుగా గోల్ఫ్ పోటీల్లో పాల్గొంటున్న అదితి అశోక్ ప్రదర్శించిన ఆటతీరు అద్భుతం. ఒలింపిక్స్ లో జూలు విదిల్చిన అదితి అనితర సాధ్యమైన ఆటతీరుతో 79వ స్థానం నుంచి 23వ స్థానానికి ఎగబాకింది. మొదటి మూడు రోజుల్లో మొత్తం 215 పాయింట్లు సాధించింది. ఆమె నేడు కీలక మ్యాచ్ ఆడనుంది. దీంతో రియో ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. రియోలో పాల్గొంటున్న అతి పిన్నవయసు గోల్ఫ్ క్రీడాకారుల్లో అదితి ఒకరు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని బట్టి దక్షిణ కొరియా, న్యూజిలాండ్, అమెరికా, చైనా క్రీడాకారులు తొలిస్థానాల్లో ఉండగా, వారి నుంచి ఆమెకు గట్టిపొటీ ఎదురవుతోంది. కాగా, గోల్ఫ్ లో అర్హత సాధించిన ఏకైక భారతీయ అథ్లెట్‌గా అదితి అశోక్ రికార్డు సృష్టించింది. అతి చిన్న వయస్సులోనే లల్లా ఐచా టూర్ స్కూల్, 2016 సీజన్‌కు లేడీస్ యూరోపియన్ టూర్ కార్డును అదితి సొంతం చేసుకుంది. ఆమె ఇంటర్నేషనల్ టూర్ కోసం క్యూస్కూల్ ను గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. ఆమె రికార్డులే ఆమె ఆటతీరుకు నిదర్శనం. ఈ విభాగంలో అదితి పతకం గెల్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె అటతీరే అంత!