: పీవీ సింధుకు రూ.50 లక్షల బీఏఐ నజరానా!... పుల్లెల గోపీచంద్ కు రూ.10 లక్షలు!

రియో ఒలింపిక్స్ లో భారత్ కు పసిడి పతకం తెస్తుందనుకున్న బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు నిన్న రాత్రి జరిగిన టైటిల్ పోరులో పోరాడి ఓడింది. అయినా దేశానికి ఆమె రజత పతకాన్ని తీసుకొచ్చింది. రియోలో భారత్ కు అసలు పతకాలే దక్కే ఛాన్స్ లేదన్న భావనను కొట్టిపారేస్తూ మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని తీసుకురాగా, మరో అడుగు ముందుకేసిన సింధు రజత పతకాన్ని సాధించింది. ఈ క్రమంలో ఒలింపిక్స్ లో సత్తా చాటిన సింధుకు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బీఏఐ) రూ.50 లక్షల నజరానాను ప్రకటించింది. అదే సమయంలో సింధుకు మెరుగైన శిక్షణ ఇచ్చి, దేశానికి పతకం తెచ్చేలా కృషి చేసిన కోచ్ పుల్లెల గోపీచంద్ కు రూ.10 లక్షల నజరానాను అందించనున్నట్లు బీఏఐ వెల్లడించింది.