: షాకింగ్ న్యూస్...గుజరాత్ ఘటనలతో 60 వేల మంది దళితుల మతమార్పిడికి సిధ్ధం
నలుగురు దళితులను కారుకు కట్టేసి చితక్కొట్టిన సంఘటనతో సంఘటితమైన గుజరాత్ దళితులు, దాడులు పెరిగిపోతుండడంతో హిందూ మతానికి షాకిచ్చే నిర్ణయాన్ని తీసుకున్నారు. భారీ ఎత్తున గుజరాత్ దళితులు బౌద్ధమతాన్ని స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. సుమారు 60 వేల మంది గుజరాత్ దళితులు బౌద్ధమతాన్ని స్వీకరించేందుకు రంగం సిద్ధం చేసుకోగా, వారిలో 50 వేల మంది దళితులు ఇప్పటికే మతం మారే దరఖాస్తులను గుజరాత్ దళిత్ సంఘటన్ కు సమర్పించారు. ఈ దరఖాస్తులన్నింటినీ జిల్లా అధికార యంత్రాంగాలకు అందజేశామని సంఘటన్ సహ వ్యవస్థాపకులు అశోక్ సామ్రాట్ మీడియాకు తెలిపారు. అధికారులు అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా మతమార్పిడి కార్యక్రమం ఆగేది కాదని ఆయన స్పష్టం చేశారు. మతం మారాలనుకున్న వాళ్లు ముందస్తుగా జిల్లా అధికార యంత్రాంగం నుంచి అనుమతి తీసుకోవాలంటూ 2009లో గుజరాత్ ప్రభుత్వం మతస్వేచ్ఛా చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. అయినప్పటికీ 2013లో సౌరాష్ట్ర దళిత సంఘటన ఆధ్వర్యంలో దాదాపు లక్ష మంది దళితులు హిందూమతాన్ని వదిలిపెట్టి బౌద్ధమతాన్ని స్వీకరించారు. అప్పట్లో కూడా సగం మంది మతం మారేందుకు అధికారులు అంగీకరించలేదని, వారి నుంచి దరఖాస్తులు స్వీకరించలేదని ఆరోపణలు వచ్చాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో రాజ్కోట్, అహ్మదాబాద్, వడోదర, పలాన్ పూర్ లలో జరిగే బహిరంగ సభల్లో ఈ మత మార్పిడులు జరుగుతాయని దళిత సంఘటన్ నేతలు తెలిపారు.