: కుందేలు అనుకుని తొమ్మిదేళ్ల అమ్మాయిని షూట్ చేసిన వేటగాళ్లు.. చిన్నారి మృతి
చైనాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుందేలుని వేటాడాలనుకున్న ముగ్గురు వ్యక్తులు పొరపాటున ఓ తొమ్మిదేళ్ల అమ్మాయిని నాటు తుపాకీతో కాల్చారు. దీంతో ఆమ్మాయి అక్కడికక్కడే మృతి చెందింది. అన్‌హుయి ప్రావిన్స్‌లో జాంగ్, వూ, లూయిలు అనే ముగ్గురు వ్యక్తులు కుందేళ్లను వేటాడాలనుకున్నారు. వారిలో జాంగ్ పొలాల్లో ఆడుకుంటోన్న అమ్మాయిని చూసి, కుందేలు అనుకొని పికప్ ట్రక్ నుంచి షూట్ చేశాడు. దగ్గరికి వెళ్లి చూసి తాము అమ్మాయిని షూట్ చేసినట్లు తెలుసుకున్నారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు చనిపోయిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులకు ముగ్గురు వేటగాళ్లు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.