: గుడివాడలో దారి దోపిడీ!... పెట్రోల్ బంకు సిబ్బంది కళ్లల్లో కారం కొట్టి రూ.3.83 లక్షలు చోరీ!
కృష్ణా జిల్లాలో పవిత్ర కృష్ణమ్మ పుష్కరాల కోలాహలం నెలకొంది. ఇదే మంచి సమయమనుకున్నారేమో, దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. బ్యాంకుకెళుతున్న పెట్రోల్ బంకు సిబ్బంది కళ్లల్లో కారం కొట్టి రూ.3.83 లక్షలను ఎత్తుకెళ్లారు. కృష్ణా జిల్లా గుడివాడలోని పెద్ద కాల్వ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. పెట్రోల్ బంకులో వసూలైన మొత్తాన్ని బంకు సిబ్బంది బ్యాంకులో జమ చేసేందుకు బయలుదేరారు. ఈ విషయాన్ని గమనించిన దోపిడీ దొంగలు దారి కాచి విరుచుకుపడ్డారు. పెట్రోల్ బంకు సిబ్బంది కళ్లల్లో కారం కొట్టిన దొంగలు డబ్బు సంచి ఉన్న బంకు ఉద్యోగిపై దాడి చేసి నగదును ఎత్తుకెళ్లారు.