: నయీమ్ కేసులో నిరాధారమైన వార్తలను నమ్మొద్దు.. కేసుల వివరాలు తెలిపిన సిట్
తెలంగాణ పోలీసుల చేతిలో ఇటీవల హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ విషయంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) అధికారులు ఈరోజు హైదరాబాదులో మీడియాకు పలు వివరాలు తెలిపారు. నయీమ్‌పై వస్తోన్న నిరాధారమైన వార్తలను నమ్మొద్దని పేర్కొన్నారు. తాము జరిపిన సోదాల్లో పలు చోట్ల ల్యాండ్ డాక్యుమెంట్లు, అక్రమ ఆయుధాలు, బంగారు నగలు, పేలుడు పదార్థాలు, భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాల వారీగా నయీమ్, అతని గ్యాంగ్ పై నమోదైన కేసుల వివరాలను సిట్ బృందం పేర్కొంది. నల్గొండ -14, మహబూబ్ నగర్-14, హైదరాబాద్-7, కరీంనగర్- 4, నిజామాబాద్-1 చొప్పున కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. నయీమ్ కేసులో నేరస్తులందరినీ గుర్తిస్తామని తెలిపింది. నయీమ్ అనుచరుడు ఫయీజ్‌ను శంషాబాద్‌లో అరెస్ట్ చేశామని పేర్కొంది. నయీమ్ కేసులో వివరాలు ఇవ్వాలనుకుంటే 9440627218 నంబరుకి ఫోన్ చేయొచ్చని తెలిపింది.