: 3.5 లక్షల అకౌంట్లను తొలగించిన ట్విట్టర్.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుండడమే కారణం
ఉగ్రవాదం గురించి ప్రచారం చేస్తున్న, ప్రోత్సహిస్తున్న 3.6 లక్షల అకౌంట్లను ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్ మూసివేసింది. 2015 మధ్య నుంచి ఇప్పటి వరకు మూడున్నర లక్షల అకౌంట్లను తొలగించినట్టు గురువారం ట్విట్టర్ పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) మిలిటెంట్లతో సంబంధం కలిగిన ట్విటర్ అకౌంట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై అమెరికా తీవ్రంగా విరుచుకుపడింది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ట్విట్టర్ 2015 మధ్యలో 1.25 లక్షల అకౌంట్లపై నిఘా పెట్టి వాటిని తొలగించింది. తాజాగా ఫిబ్రవరి నుంచి మరో 2.35 లక్షల అకౌంట్లను రద్దు చేసింది. వీటిలో చాలా వరకు ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలు ఉన్నవే కావడం గమనార్హం. గతేడాది నుంచి ఉగ్రవాద సంబంధ అకౌంట్లు రోజుకు 80 శాతం చొప్పున సస్పెండ్ అవుతున్నట్టు ట్విట్టర్ పేర్కొంది. అయితే ఇక్కడితో తమ పని పూర్తికాలేదని, ఇటువంటి అకౌంట్లపై నిఘా కొనసాగుతుందని ట్విట్టర్ స్పష్టం చేసింది. నీస్‌లో జూలైలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే.