: అంతా పీవీ సింధు మేనియానే!
అంతా తెలుగు తేజం సింధుకు సంబంధించిన చర్చే. ఏ పత్రిక, ఏ న్యూస్ ఛానెల్ చూసినా సింధు విజయంపైనే వార్తలు, వార్తా కథనాలు, లైవ్ డిబేట్లు. వెరసి దేశం మొత్తం మీద సింధు మేనియా సాగుతోంది. రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీస్ లో విజయం సాదించిన పీవీ సింధు దేశాన్ని మొత్తం రియో వైపు తిప్పేసింది. దేశీయ, ప్రాంతీయ పత్రికలన్నిటా సింధు సాధించిన విజయంపైనే ప్రధాన వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఫలితంగా రాజకీయ వార్తలు సహా ఇతర అంశాలకు చెందిన వార్తలకు పెద్దగా ప్రాధాన్యమే లభించలేదు. నిన్న రాత్రి సింధు సాధించిన విజయంపై ప్రత్యేక కథనాలను ప్రచురించిన మీడియా... నేడు సింధు ఆడనున్న ఫైనల్ పైనా ప్రత్యేక వార్తా కథనాలను రాసింది. ఇక ఏ ఇద్దరు కూడినా సింధు విజయంపైనే చర్చలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది.