: ప్రపంచంతో కంటతడి పెట్టిస్తున్న సిరియా బాలుడు


సిరియాలోని ప్రభుత్వ తిరుగుబాటుదారులు అలెప్పో‌పై జరిపిన వైమానిక దాడుల్లో గాయపడి షాక్‌కు గురైన ఐదేళ్ల బాలుడు ఒర్మాన్ డఖ్నీష్ ప్రపంచంతో కన్నీరు పెట్టిస్తున్నాడు. సోషల్ మీడియలో వైరల్ అయిన అతడి చిత్రాన్ని చూసిన పలువురు.. సిరియా పౌరుల దుస్థితికి ఇది నిలువెత్తు నిదర్శనమని పేర్కొంటున్నారు. అలెప్పోపై జరిగిన వైమానిక దాడుల్లో ఓ భవనం దెబ్బతింది. అందులో ఓ కుటుంబం చిక్కుకుపోయింది. సహాయక సిబ్బంది అప్రమత్తమై వారిని రక్షించారు. ఆ తర్వాత గంటకే ఆ భవనం కూలిపోయింది. సహాయక సిబ్బంది రక్షించి, బయటకు తీసుకొచ్చిన వారిలో ముక్కుపచ్చలారని ఒర్మాన్ కూడా ఉన్నాడు. పూర్తిగా దుమ్ము కొట్టుకుపోయి రక్తంతో తడిసిపోయిన బాలుడిని చికిత్స కోసం అంబులెన్సులో తరలించారు. అయితే ఏం జరిగిందో అర్థం కాక బాలుడు నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. వైమానిక దాడులపై అలెప్పో మీడియా సెంటర్ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో కనిపించిన ఈ బాలుడిని చూసిన ప్రతి ఒక్కరి హృదయాలు ద్రవించి పోతున్నాయి. సహాయక సిబ్బంది రక్షించిన వారిలో 1, 6 సంవత్సరాలున్న ఒర్మాన్ సోదరులు, అతడి తల్లిదండ్రులు ఉన్నారు. అయితే వారికి పెద్దగా గాయాలు కాలేదు.

  • Loading...

More Telugu News