: తొలిసెట్ గెలుచుకున్న సింధు...పతకానికి మరో సెట్ దూరంలో తెలుగుతేజం
రియో ఒలింపిక్స్ లో మరో సెట్ దూరంలో పీవీ సింధు నిలిచింది. బ్రెజిల్ లోని రియో డీ జెనీరోలో జరుగుతున్న బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో తెలుగు తేజం సింధు తొలి సెట్ ను 21-19 తేడాతో గెలుచుకుంది. జపాన్ కు చెందిన ఒకుహరా హోరాహోరీగా ఆడుతోంది. షాట్లు, ర్యాలీలతో విరుచుకుపడుతోంది. సింధు షాట్లు కొట్టే అవకాశం లేకుండా షటిల్ ఏమాత్రం ఎత్తులో వెళ్లకుండా నెట్ కు సమాంతరంగా ఆడుతూ సవాలు విసిరుతోంది. కోర్టులో తనకంటే ఎత్తుగా ఉన్న సింధును ఇబ్బంది పెట్టేలా నెట్ గేమ్ (నెట్ దగ్గర డ్రాప్ చేయడం) తో సవాలు విసురుతోంది. సుమారు అర్ధగంట పాటు సాగిన తొలి సెట్ లో ఇద్దరు క్రీడాకారిణులు హోరాహోరీగా పాయింట్లు సాధించి సత్తా చాటారు. అయితే సింధు నియంత్రణలో షాట్లు ఆడుతూ ఆకట్టుకుంది. రెండో సెట్ లో 2 పాయింట్లతో సింధు ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సెట్ ను కూడా గెలుచుకుంటే రియోలో భారత్ కు పతకం ఖాయం. కాగా, సింధు గేమ్ ను తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని టీవీ ఛానెల్స్ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి.