: ఏపీకి హోదా లేదు.. రాజధానికి నిధులు లేవు: అంబటి రాంబాబు
ఏపీకి హోదా లేదని, రాజధానికి నిధులు లేవని, పోలవరాన్ని పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి నామ మాత్రపు నిధులిచ్చి ఏపీ ప్రజలను కేంద్రం అవమానించడం తగదన్నారు. ఏపీ నూతన రాజధాని నిర్మాణానికి రూ.4 లక్షల కోట్లు అడిగితే కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.450 కోట్లు మాత్రమే ఇచ్చిందని, రాష్ట్రానికి నామ మాత్రపు నిధులు కేటాయించిన కేంద్రంపై సీఎం చంద్రబాబు మాట్లాడకపోవడం సబబుకాదన్నారు. చంద్రబాబు తక్షణం స్పందించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి పోలవరం ప్రాజెక్టును భూస్థాపితం చేయాలని చూస్తున్నాయంటూ అంబటి విమర్శించారు.