: ఆ ద్వీపకల్పం పేరు 'అర్థం కాలేదు'!
మెక్సికో తీరాన గల్ఫ్ ఆఫ్ మెక్సికో, కరేబియన్ సముద్రాన్ని వేరు చేస్తూ 'యుకాటన్' ద్వీపకల్పం ఉంది. దీనికి ఈ పేరు చిత్రంగా వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. 15వ శతాబ్దంలో స్పెయిన్ కు చెందిన కొంత మంది నావికులు సముద్రయానం చేస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఎక్కడికి వచ్చామో అర్ధం కాని స్పానిష్ నావికులు, స్థానిక మయన్ ప్రజలను 'మేము ఎక్కడున్నాం?' అని అని అడిగారట. వారి భాష అర్థం కాని మయన్ ప్రజలు 'యుకాటన్' అని చెప్పారట. ఆ భాషలో 'యుకాటన్' అంటే 'మీరు చెప్పింది అర్థం కాలేదు' అని అర్థం. అయితే, ఆ విషయం తెలియని స్పానిష్ నావికులు ఆ ప్రాంతం పేరు 'యుకాటన్' అని భ్రమించి, ఆ ప్రాంతాన్ని 'యుకాటన్' గా పిలవడం మొదలుపెట్టారు. దీంతో ఆ పేరు స్థిరపడిపోయింది. అలాగే ఈ పేరు వెనుక ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది. మెక్సికోలోని ప్రాంతీయ భాషల్లో ఒకటైన అజ్ టెక్ భాషలో ‘యొకాట్లిన్’ అనే పదం నుంచి 'యుకాటన్' అనే పేరు వచ్చిందని, ‘యొకాట్లిన్’ అంటే ఐశ్వర్యం ఉన్న ప్రాంతమని అర్థమని తెలుస్తోంది. ఈ విషయాలను స్పెయిన్ తొలి గవర్నర్ హెర్నన్ కొర్ట్స్ అప్పటి రోమన్ చక్రవర్తి ఛార్లెస్-5కి రాసిన లేఖలో పేర్కొన్నారు.