: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన విద్యార్థినులకు హైదరాబాద్‌లో ఘనస్వాగతం
నిజామాబాద్ సాంఘిక సంక్షేమ, కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థినులు ఇటీవలే ప్రసిద్ధ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి ఆ 16 మంది విద్యార్థునులు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. శిక్షకులు శేఖర్‌బాబు, పూర్ణ ఆధ్వర్యంలో తాము కిలిమంజారో పర్వతం అధిరోహించామని విద్యార్థినులు మీడియాతో చెప్పారు. తమ శిక్షకులు తమకు ఎంతగానో సహకరించారని పేర్కొన్నారు. కిలిమంజారోకు వెళ్లేందుకు విమానం ఎక్కామని, విమానం ఎక్కడం తొలిసారి అని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమతో పాటు కిలిమంజారోకి వచ్చిన సిబ్బందికి, శిక్షకులకి వారు ధన్యవాదాలు తెలిపారు. తమకు ప్రభుత్వాధికారులు మంచి సహాయాన్నందించారని పేర్కొన్నారు. పూర్తి ట్రయినింగ్ ఇచ్చిన తరువాతే వారిని కిలిమంజారోకి తీసుకెళ్లామని శిక్షకులు శేఖర్‌బాబు పేర్కొన్నారు. వారు కిలిమంజారోలో ఆహారం కోసం కాస్త ఇబ్బందులు పడ్డట్లు చెప్పారు.