: ఉద్యోగానికి వెళ్లి పూణేలో అదృశ్యమైన విజయవాడ యువకుడు
మహారాష్ట్రలో ఓ తెలుగు యువకుడు అదృశ్యమయ్యాడు. తమ బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో ఆ యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సర్కారు తమను ఆదుకోవాలని, తమ బిడ్డ ఆచూకీని కనిపెట్టాలని విన్నవించుకుంటున్నారు. విజయవాడ గ్రామీణ మండలం నున్న ప్రాంతానికి చెందిన గుదిబండి లక్ష్మారెడ్డి, పార్వతి భవానీ దంపతుల కుమారుడు, ఎంబీఏ గ్యాడ్యుయేట్ శ్రీహర్షారెడ్డి ఉద్యోగం కోసం గతేడాది మహారాష్ట్రలోని పూణేకు వెళ్లాడు. డిసెంబరులో వొడాఫోన్ కంపెనీలో టీం మేనేజర్‌గా చేరాడు. విజయవాడలో ఉన్న తన తల్లిదండ్రులతో ప్రతిరోజు ఫోనులో మాట్లాడేవాడు. అయితే ఈనెల 6 నుంచి శ్రీహర్షారెడ్డి నుంచి ఫోను రావడం లేదు. తల్లిదండ్రులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. దీంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు ఈ నెల 9న పూణేకు వెళ్లారు. అక్కడ తమ కుమారుడి గురించి ఆరా తీయగా శ్రీహర్షారెడ్డి అదృశ్యం అయినట్లు వారికి తెలిసింది. దీంతో వారు కరాడిలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీరికి మరాఠీ, హిందీ భాషలు సరిగా రాకపోవడంతో వారు ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు శ్రీహర్షారెడ్డి గురించి సరిగా స్పందించ లేదు. అనంతరం అదృశ్యమయిన యువకుడి బావ ప్రదీప్ పూణేకు వెళ్లి విచారించాడు. ఈనెల 6న మధ్యాహ్నం 1:55 గంటలకు శ్రీహర్షారెడ్డి తాను నివసిస్తోన్న హాస్టల్ నుంచి బయటకు వచ్చాడని తెలిసింది. ఈ తరువాత 2 గంటలకు ఏటీఎంలో రూ.6 వేలు డ్రా చేశాడని, అయితే 2:53 గంటల తర్వాత ఫోన్‌తో సంబంధాలు తెగిపోయాయని తెలిసింది. తమ కొడుకు కనిపించకుండా పోవడంతో అతని తల్లి పార్వతిభవానీ ఆరోగ్యం క్షీణించింది. కనీసం మంచినీళ్లు తాగేందుకు కూడా ఆమె శరీరం సహకరించడం లేదు. తండ్రి లక్ష్మారెడ్డి తమ కుమారుడి కోసం ఇంకా పూణెలోనే ఉన్నాడు. స్థానిక రాజకీయ నాయకులు జీతం శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యరాజులు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు వీరి పరిస్థితిని గురించి వారు వివరించారు. సర్కారు ద్వారా తాము అతని ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.