: ప్రపంచపు అతిపెద్ద విమానం 'ఎయిర్ ల్యాండర్' గాల్లోకి ఎగిరింది!
ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎట్టకేలకు గాలిలోకి ఎగిరింది. 'ఎయిర్ ల్యాండర్-10' పేరుతో రూపొందిన ఈ విమానం మధ్య ఇంగ్లండ్ లోని కార్డింగ్టన్ ఎయిర్ ఫీల్డ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు గుమిగూడి దీనిని వీక్షించారు. 1930 అక్టోబర్ లో ఇదే ఎయిర్ ఫీల్డ్ నుంచి ఎయిర్ షిప్ ఆర్ 101 గాల్లోకి ఎగిరి ఫ్రాన్స్ లో కుప్పకూలింది. ఆ ఘటనలో 30 మంది మరణించారు. దీంతో బ్రిటన్ ఎయిర్ షిప్ లను నిర్మించడం ఆపేసింది. సుదీర్ఘ విరామం తరువాత 302 అడుగుల పొడవైన ఎయిర్ ల్యాండర్ ను అమెరికన్ ఆర్మీ కోసం బ్రిటన్ సంస్థ హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ (హెచ్ఏవీ) ను రూపొందించింది. వాస్తవానికి దీనిని నాలుగు రోజుల కిందటే తొలిసారి నడిపాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాల వల్ల దీనిని నడపడం సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు నడిపారు. దీనిని హెలికాప్టర్ టెక్నాలజీతో ప్రత్యేకంగా రూపొందించారు. దీంతో ఇది ల్యాండ్ అయ్యేందుకు ప్రత్యేకంగా రన్ వే అవసరం లేదు. నేల, నీరు, ఐస్, ఇలా ఎక్కడైనా దీనిని ల్యాండ్ చేయవచ్చని రూపకర్తలు చెబుతున్నారు.