: దేశద్రోహం కేసు ఎఫెక్ట్.. భారత్లో తమ ఆఫీసులను తాత్కాలికంగా మూసివేసిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
ప్రపంచ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాలో తమ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపింది. ఇటీవల నెలకొన్న కశ్మీర్ కల్లోల పరిస్థితులపై బెంగళూరులో ఆ సంస్థ చర్చాకార్యక్రమం ఏర్పాటు చేసింది. అయితే, ఈ సమావేశంలో పలువురు దేశ ద్రోహ నినాదాలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమ్నెస్టీపై దేశద్రోహం కేసు నమోదైంది. ఆమ్నెస్టీ సర్కారుకి వ్యతిరేకంగా ద్వేషాన్ని ప్రోత్సహిస్తోందని కొందరు రాజకీయ కార్యకర్తలు దానికి వ్యతిరేకంగా రెండు రోజులుగా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో బెంగళూరు, పుణె, న్యూఢిల్లీ, చెన్నైలలో ఉన్న తమ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసింది. తాము నిర్వహించే కార్యక్రమాలను కూడా వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. ఏబీవీపీ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమ్నెస్టీ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో దేశద్రోహ నినాదాలు చేశారా? లేదా? అనే అంశంపై విచారణ చేపట్టారు. దీనిపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్పందిస్తూ.. తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. తమ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది ప్రజలు కశ్మీర్‌కు స్వాతంత్ర్యాన్ని కావాలంటూ మాత్రమే నినదించారని చెప్పింది. తమ కార్యాలయంలో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్నదానికి ఎటువంటి ఆధారాలు లేకుండానే, తమ సంస్థపై కేసును నమోదుచేశారని తెలిపింది. తాము చేపట్టిన ఆ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ఎంతో మంది వచ్చి వెళ్లిపోతుంటారని పేర్కొంది. అయితే తమ సంస్థకు చెందిన ఎవరూ దానిలో పాల్గొనలేదని వివరించింది. జమ్ము కశ్మీర్లో కష్టాలు పడుతున్న వారికి న్యాయం చేసేందుకే తాము ఆ కార్యక్రమం నిర్వహించామని ఆమ్నెస్టీ తెలిపింది. కార్యక్రమం జరుగుతుండగా తీసిన ఓ వీడియోను సంస్థ పోలీసులకు ఇచ్చింది. దానిపై ఫోరెన్సిక్ నిపుణులు విచారణ చేపట్టనున్నారు.