: ఉపకలెక్టర్ చెంప ఛెళ్లుమనిపించి కేసులో ఇరుక్కున్న ఎన్‌సీపీ ఎమ్మెల్యే
మహారాష్ట్రలోని రాయగఢ్‌లో ఉపకలెక్టర్‌పై చేయిచేసుకున్న ఎన్‌సీపీ ఎమ్మెల్యే సురేశ్ లాడ్‌పై ఈరోజు కేసు నమోదయింది. ఉపకలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదు చేశారు. ఉపకలెక్టర్ తన బాధ్యతలు నిర్వర్తిస్తోన్న సమయంలో ఆయనను బెదిరించడం, హింసకు దిగడం వంటి ఆరోపణలు సురేశ్ లాడ్‌పై వచ్చిన సంగతి తెలిసిందే. ఓ ప్రాజెక్టులో స్థానిక రైతులకు పరిహారం ఇప్పించే క్రమంలో రాయ్‌గఢ్ ఆఫీస్‌లో ఉప కలెక్టర్ రైతులతో చర్చిస్తున్నారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యే సురేశ్ లాడ్ ఉపకలెక్టర్‌తో పాటు మరో అధికారిపై చేయిచేసుకున్నాడు. తమకు నష్టపరిహారం అవసరం లేదని, భూమే కావాలంటూ రైతులు ఉపకలెక్టర్ ముందు ఆందోళన చేస్తోన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు ఓ కెమెరా కంటికి చిక్కి దేశమంతటా వ్యాప్తించాయి. ఘటన జరిగి 24 గంటలైనా ఆయనపై కేసు నమోదు కాలేదంటూ సర్వత్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు.