: విశాఖలో తెలంగాణ సిట్!... వారం రోజులుగా నయీమ్ దందాపై గుట్టుగా విచారణ!
ఖాకీలకే పెను సవాల్ గా మారిన గ్యాంగ్ స్టర్ నయీమ్ నయా దందా ఎల్లలు దాటిపోయింది. పాలమూరు జిల్లా షాద్ నగర్ లో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో అతడు మరణించిన తర్వాత అతడి కార్యకలాపాల గుట్టు విప్పేందుకు తెలంగాణ సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి నేతృత్వంలోని సిట్... నయీమ్ కార్యకలాపాలపై విస్తృత దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీలోని విశాఖపట్నంలోనూ నయీమ్ తనదైన శైలిలో దందాను సాగించినట్లు పక్కా ఆధారాలు సేకరించిన సిట్... వారం క్రితమే అక్కడకు చేరుకుంది. స్థానిక పోలీసులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా, వారి సహకారం లేకుండా విశాఖను సిట్ అధికారులు జల్లెడ పడుతున్నారు. విశాఖకు చెందిన ఓ మాజీ పోలీసు అధికారికి నయీమ్ తో సంబంధాలున్నాయన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్న సిట్ అధికారులు ఆ దిశగా పక్కా ఆధారాలు సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం.