: పున్నమి ఘాట్ లో వైఎస్ జగన్!... విపక్ష నేత పుష్కర స్నానానికి పోటెత్తిన అభిమానం!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం పుష్కర స్నానమాచరించారు. నేటి ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరి విజయవాడ వచ్చిన జగన్... నగరంలో ఏర్పాటు చేసిన పున్నమి ఘాట్ కు చేరుకున్నారు. పార్టీ నేతలు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), జోగి రమేశ్, సామినేని ఉదయభాను తదితరులు వెంట రాగా వైఎస్ జగన్ శాస్త్రోక్తంగా పుష్కర స్నానం చేశారు. ఈ సందర్భంగా జగన్ ను చూసేందుకు జనం ఆసక్తి కనబరచారు. అక్కడ జన సందోహం పెరగడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. పుష్కర స్నానం పూర్తి చేసిన జగన్... తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదానం చేశారు.