: ‘పొన్నం’ వారి కంపెనీకి రిబ్బన్ కట్ చేసిన కేటీఆర్!... గులాబీ గూటికి కాంగ్రెస్ నేత అంటూ ప్రచారం!
టీ కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పార్టీ మారుతున్నారా? కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లోకి జంప్ చేస్తున్నారా? అంటే... అవుననే అంటున్నాయి రెండు పార్టీలకు చెందిన కొన్ని వర్గాలు. ఈ తరహా ప్రచారానికి నిన్న జరిగిన ఒకేఒక్క కార్యక్రమమే కారణమని తెలుస్తోంది. వివరాల్లోకెళితే... పొన్నం ప్రభాకర్ సోదరుడి కుమారుడు హుజూరాబాదులో ‘టెలెకా నెట్ వర్క్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట ఓ ఐటీ స్టార్టప్ ను నెలకొల్పారు. ఈ కంపెనీని నిన్న టీఆర్ఎస్ యువనేత, తెలంగాణ కేబినెట్ లో కీలక మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పొన్నం కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలతో పొన్నం ఓ చోట కూర్చుని ముచ్చటిస్తూ కనిపించారు. దీంతో పొన్నం కూడా టీఆర్ఎస్ లో చేరిపోవడం ఖాయమేనన్న ప్రచారానికి తెర లేచింది. దీనిపై పలు మీడియా సంస్థలు తమదైన శైలిలో కథనాలు రాసేశాయి. వీటిపై స్పందించిన పొన్నం... తన సోదరుడి కుమారుడు పెట్టిన కంపెనీ ప్రారంభోత్సవం జరుగుతున్న కారణంగానే తాను ఆ కార్యక్రమానికి హాజరయ్యానని, ఇందులో వేరే కారణమేమీ లేదని చెప్పుకొచ్చారు.