: హౌస్ అరెస్ట్‌లో కశ్మీర్ వేర్పాటువాది గిలానీ.. సోషల్ మీడియాలో చక్కర్లు!
హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ అనంతరం కశ్మీర్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. రావణకాష్టంలా లోయ ఇంకా మండుతూనే ఉంది. కశ్మీర్ అల్లర్లను అణచి వేసేందుకు నడుం బిగించిన ప్రభుత్వం ఆందోళనలు మరింత పెచ్చరిల్లకుండా వేర్పాటువాదులపై ఉక్కుపాదం మోపింది. సయ్యద్ అలీ షా గిలానీ సహా రెండు డజన్ల మంది వేర్పాటువాదులను హౌస్ అరెస్ట్ చేసింది. కర్ఫ్యూ విధించింది. ముందు జాగ్రత్త చర్యగా ఫోన్లు, మొబైల్ డాటా సర్వీసులు, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అయితే విచిత్రంగా గృహ నిర్బంధంలో ఉన్న గిలానీ వీటిని మాత్రం ఎంచక్కా వినియోగిస్తున్నాడు. సోషల్ మీడియాలో తరచూ పోస్టులు చేస్తూ యువతను మరింత రెచ్చగొట్టే కార్యక్రమాలకు పూనుకుంటున్నాడు. ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా తన ‘ప్రపంచానికి’ అందుబాటులో ఉంటూ ట్వీట్ల మీద ట్వీట్లు కురిపిస్తున్నాడు. ఖాయిద్-ఇ-ఇంక్విలాబ్ పేరుతో ఫేస్‌బుక్‌ను తెగవాడేస్తున్నాడు. ‘అమరవీరుల’ గురించి పోస్టింగులు చేస్తూ కశ్మీర్ యువతను మరింత రెచ్చగొట్టే కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా ఆయన ట్వీట్లు చేయడం గమనార్హం. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ జెండా ఆవిష్కరణ సందర్భంగా పొరపాటున త్రివర్ణ పతాకం పోల్ నుంచి కింద పడింది. దీనిని ఫొటోతో పాటు పోస్టు చేసిన గిలానీ ‘‘భారత్ పతాకం సిగ్గుతో పడిపోయింది. కానీ, అమాయక కశ్మీరీల హత్యల అవమానాన్ని మాత్రం దాచిపెట్టలేకపోయింది’’ అని రాశాడు. పాన్ ఇస్లామిస్ట్ గ్రూపు జమాతే ఇస్లామీ చీఫ్ అయిన గిలానీ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలోనూ సంస్థలను నడుపుతున్న విషయం తెలిసిందే.