: బీహార్‌లో బీజేపీ నేత కాల్చివేత.. నితీశ్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం
బీహార్‌లో బీజేపీ నేతను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బీజేపీ నేత, ప్రముఖ వ్యాపారి అయిన అశోక్ జైస్వాల్‌ను దానాపూర్‌లోని రద్దీగా ఉండే మార్కెట్‌లో బుధవారం సాయంత్రం దుండగులు కాల్చి చంపారు. అశోక్ హత్య వార్త తెలిసిన బీజేపీ నేతలు, మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. నితీశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అశోక్ హత్యకు నిరసనగా గురువారం బంద్ ప్రకటించారు. తన ఇంటికి సమీపంలో అశోక్ నిర్వహిస్తున్న బియ్యం దుకాణం వద్దకు వచ్చిన నలుగురు దుండగుల్లో ఇద్దరు ఆయనను అతి సమీపం నుంచి కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు. నాలుగు బుల్లెట్లు అతడి శరీరంలోకి చొచ్చుకుపోయినట్టు చెప్పారు. కాల్పుల అనంతరం దుండుగులు పరారయ్యారని పేర్కొన్నారు. జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న అశోక్ 2010 అసెంబ్లీ ఎన్నికల్లో దానాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అశోక్ హత్యకు సంబంధించి ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా 24 గంటల్లోగా నిందితులను పట్టుకోవాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.