: ప్రతి రోజు రోడ్లపైకి 53 వేల కొత్త వాహనాలు.. గతేడాది 1.96 కోట్ల వాహనాల రిజిస్ట్రేషన్


భారత్‌లో వాహన వినియోగం శరవేగంగా పెరుగుతోంది. 1993 వరకు మామూలుగా ఉన్న వాహనాల కొనుగోళ్లు ఆ తర్వాత ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ట్రాన్స్‌పోర్టు విభాగం గణాంకాల ప్రకారం గతేడాది వాహనాల రిజిస్ట్రేషన్ ఆల్‌టైం హైకి చేరుకుంది. 2015లో ఏకంగా 1.96 కోట్ల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. అంటే ప్రతి రోజు 53,720 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయన్నమాట. 1993 వరకు వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అప్పటి వరకు ఏడాదికి 10 లక్షల లోపులోనే వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ఆ తర్వాత దశాబ్ద కాలంపాటు కొంచెం అటూ ఇటుగా ఉండేది. కానీ 2010 తర్వాత ఒక్కసారిగా ఊపందుకుంది. 2014లో 1.94 కోట్ల వాహనాలు రిజిస్టర్ కాగా 2015లో ఆ సంఖ్య 1.96 కోట్లకు చేరుకుంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ ఈ విషయంలో ముందంజలో ఉంది. గతేడాది ఆ రాష్ట్రంలో 24.38 లక్షల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. 19.91 లక్షల వాహనాలతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉండగా కర్ణాటక 15.15 లక్షల వాహనాలతో ఆ తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది. దేశ రాజధాని ఢిల్లీలో గతేడాది 6.27 లక్షల వాహనాలు మాత్రమే రిజిస్టర్ అవడం గమనార్హం. రిజిస్టర్ అవుతున్న వాహనాల సంఖ్యలో రీరిజిస్ట్రేషన్ వాహనాలు కూడా ఉన్నట్టు రవాణా మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే వాటి సంఖ్య బహు తక్కువన్నారు. ‘‘రిజిస్టర్ అవుతున్న కొత్త వాహనాల్లో 75 శాతం ద్విచక్ర వాహనాలేనని కచ్చితంగా చెప్పగలను. వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండడం, బస్సు, ఇతర పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు చార్జీలతో పోలిస్తే కిలోమీటరుకు అయ్యే ఖర్చు తక్కువగా ఉండడం వల్లే చాలామంది ద్విచక్రవాహనాలను కొనుగోలు చేస్తున్నారు’’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం 18.6 కోట్లు ఉన్న వాహనాల సంఖ్య మరో 20-30 ఏళ్లలో తక్కువలో తక్కువగా 35 కోట్లకు చేరుకుంటుందని పట్టణ రవాణా నిపుణుడు ఎన్.రంగనాథన్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News