: షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారా?... అయితే ఇది మీ కోసమే!


షార్ట్‌ ఫిల్మ్ తీయాలనుకుంటున్నారా? అసలు అలాంటి ఆలోచన ఏదైనా ఉందా? అయితే, త్వరగా ఓ షార్ట్ ఫిల్మ్ తీయండి. ఎందుకంటే, వర్ధమాన సినీ నటులు, దర్శకులు, ఇతర టెక్నీషియన్ల ప్రతిభను గుర్తించేందుకు 'సినీ బీస్' సంస్థ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించనున్నట్టు తెలిపింది. గతేడాది 24/7 పేరిట చెన్నైలో ఈ సంస్థ నిర్వహించిన కాంటెస్ట్ కు వచ్చిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది కూడా కాంటెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నిడివితో సంబంధం లేకుండా షార్ట్ ఫిల్మ్ తీసి పంపాలని ఆహ్వానిస్తోంది. ఏ భాషలో షార్ట్ ఫిల్మ్ తీసినా సబ్ టైటిల్స్ ఇంగ్లిష్ లో తప్పనిసరిగా ఉండాలనే షరతు విధించింది. ఈ కాంటెస్ట్ లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ కు లక్ష రూపాయలు, రెండో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ కు 50 వేల రూపాయలు, మూడో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ కు 25 వేల రూపాయలు అందజేయనున్నట్టు సినీ బీస్ తెలిపింది. ఈ పోటీల్లో విజేతలను నిర్ణయించేందుకు జ్యురీ మెంబర్లుగా ప్రముఖ తమిళ దర్శకుడు కె.భాగ్యరాజా, నటుడు, రచయిత యూగీ సేతు, మరో దర్శకుడు ప్రభు సాల్మన్, సీనియర్ నటి అర్చన వ్యవహరించనున్నారని ఆ సంస్థ వెల్లడించింది. కంటెస్ట్‌ కు వచ్చిన ప్రతి షార్ట్ ఫిల్మ్ ను చెన్నలోని ఒక ప్రముఖ థియేటర్‌ లో ఉచితంగా ప్రదర్శిస్తారని ఈ సంస్థ వెల్లడించింది. ఈ షార్ట్‌ ఫిల్మ్స్ పంపేందుకు చివరి తేదీ సెప్టెంబరు 30 అని వారు తెలిపారు. అదనపు వివరాలకు తమ వెబ్ సైట్ చూడాలని సినీ బీస్ సూచించింది.

  • Loading...

More Telugu News