: విమానంలోనే ప్రసవించి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
ఓ గర్భిణి విమానంలోనే ప్రసవించి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన యూఏఈ నుంచి ఫిలిప్పైన్స్ వెళుతోన్న విమానంలో చోటుచేసుకుంది. గర్భిణీ ప్రసవానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. అయినప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. మనీలా వెళ్లడానికి దుబాయ్‌లో విమానం ఎక్కిన మహిళకు విమానం గాల్లో ఉండగానే నొప్పులు వచ్చాయి. అయితే, ప్రయాణికుల్లో ఇద్దరు నర్సులు ఉండడం ఆమెకు అదృష్టంలా కలిసొచ్చింది. విమానంలోనే పలు ఏర్పాట్లు చేసి వారు ఆమెకు పురుడుపోశారు. దీంతో ఆ మహిళ పండంటి పాపకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డల ఫోటోను విమానంలోని ఓ ప్రయాణికురాలు సోషల్ మీడియాలో పోస్ట్‌చేశారు. ఆ పాపను శుభ్రం చేసిన విమాన సిబ్బంది, నర్సులు అనంతరం ఆ శిశువుకి చిన్ని చిన్ని దుస్తులు కూడా తొడిగారు. తల్లీబిడ్డలకు చికిత్స అందించడానికి ఆ విమానాన్ని హైదరాబాద్‌లో అత్యవసరంగా దింపారు. అనంతరం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తల్లీబిడ్డలను తరలించారు. ఆమెకు మూడు రోజుల తాత్కాలిక వీసాను అధికారులు మంజూరు చేశారు.