: కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న ప్రాజెక్టులపై ‘వాస్తవ జలదృశ్యం’ పేరిట హైదరాబాద్ లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో కాంగ్రెస్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తోంది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టులపై వివరిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వాస్తవ వ్యయం రూ.30 వేల కోట్లే ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మాణ వ్యయాన్ని రూ.83 వేల కోట్లకు పెంచడమేంటని ఆయన ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ తెలంగాణలో చేపడుతోన్న ప్రాజెక్టులకు డీపీఆర్ ఇవ్వకపోవడంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌లోనూ అవినీతి తారాస్థాయిలో జరుగుతోందని ఆయన ఆరోపించారు. డబ్బును కాజేయడానికే ప్రాజెక్టుల అంచనాలు అమాంతం పెంచేశారని ఆయన అన్నారు. కనీసం ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కూడా ప్రారంభించకముందే ఇప్పటికి మూడుసార్లు అంచనాలు పెంచడమేంటని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టెండర్లన్నీ బోగస్సేనని, గుత్తేదారులకు సానుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన పలు ఆరోపణలు గుప్పించారు.