: టెస్ట్ చరిత్రలో శ్రీలంక చేతిలో ఆస్ట్రేలియాకి తొలి వైట్‌వాష్
మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో శ్రీలంక అద్భుత విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేసి సంచలన విజయం నమోదు చేసింది. కొలంబోలో జరిగిన చివరి టెస్టులో ఆసీస్‌పై 163 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో వరుసగా మూడో టెస్టుల్లో గెలిచి(3-0తో) సిరీస్ ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేసింది. టెస్ట్ చరిత్రలో శ్రీలంక చేతిలో ఆస్ట్రేలియాకిదే తొలి వైట్‌వాష్. ఆస్ట్రేలియాతో శ్రీలంక సిరీస్‌కు ముందు 33 ఏళ్లలో ఈ రెండు దేశాల మధ్య జరిగిన టెస్టుల్లో శ్రీలంక ఒకే ఒక టెస్టు గెలిచిన విషయం తెలిసిందే. రంగనా హిరాత్ (13 వికెట్లు) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ చిత్తుగా ఓడింది. దీంతో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' ఆయన సొంతమయ్యాయి. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక తమ ముందుంచిన 324 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ఘోరంగా విఫలమైంది. 44.1 ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. దీంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది.