: అక్కడ ఉట్టి కొట్టాలంటే పద్దెనిమిదేళ్లు నిండాలి!
వయోపరిమితి అనేది వివాహం, ఓటు హక్కుకే కాదు, కృష్ణాష్టమి రోజున ఉట్టికొటడానికి కూడా వుండాలి. దీనిని తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయించింది. కృష్ణాష్టమిని పురస్కరించుకుని మహారాష్ట్రలో దహీ హండీ వేడుకలను (ఉట్టి కొట్టే కార్యక్రమం) ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో ఒకరిపై ఒకరు ఎక్కి మానవ పిరమిడ్ లా ఏర్పడి ఉట్టికొడతారు. ఇలా చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్వాతి పటేల్ అనే సామాజిక కార్యకర్త బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన బాంబే హైకోర్టు 18 ఏళ్ల లోపు పిల్లలు ఈ ఉత్సవాల్లో నిర్వహించే దహీ హండీ కార్యక్రమంలో పాల్గొనరాదని 2014లో తీర్పు చెప్పింది. అంతేగాక, ఒకరిపై ఒకరు ఎక్కే పిరమిడ్ ఎత్తు కూడా 20 అడుగులకు మించరాదని కూడా స్పష్టం చేసింది. ఈ తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిని విచారించిన సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు తీర్పును సమర్థించింది. 18 ఏళ్ల వయసు దాటిన వారే దహీ హండీలో పాల్గొనాలని స్పష్టం చేసింది.