: ఎట్టకేలకు తెలంగాణ ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తోన్న కాంగ్రెస్
తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని టీపీసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటన చేసిన ఎన్నో నెలల తరువాత ఎట్టకేలకు కాంగ్రెస్ ఈరోజు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తోంది. ‘వాస్తవ జలదృశ్యం’ పేరిట హైదరాబాద్ రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ప్రారంభమైన ఈ ప్రజెంటేషన్ మూడు గంటల పాటు కొనసాగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టులపై వివరించి చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల అంశంపై చేస్తోన్న వ్యాఖ్యల్లో వాస్తవాలు లేవని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై పూర్తి వివరాలు తెలపాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. కోటి ఎకరాలకు నీరు అనేది కేసీఆర్ కాకి లెక్కలేనని అన్నారు. ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకి కేసీఆర్ ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని అన్నారు. కొన్నింటికి పేరు మార్చి సర్కారు కుట్ర చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పట్ల టీఆర్ఎస్ వివక్ష ధోరణి కనబరుస్తోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల దోపిడీ జరుగుతోందని చెప్పారు. ప్రాజెక్టులకు రీడిజైనింగ్ అంటూ ప్రభుత్వం అర్థం లేని పనులు చేస్తోందని అన్నారు. పారదర్శకత లేకుండా టెండర్ల పక్రియ కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం కుమ్మక్కయిందని ఆయన ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టాన్ని కాదని జీవో 123 ఎందుకు అమలు చేయాలనుకుంటోందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ తీరుని తాము ఎండగడుతున్నామని చెప్పారు.