: నయీమ్ ట్యాక్స్!... నల్లగొండ జిల్లాలో వెలుగుచూసిన గ్యాంగ్ స్టర్ నయాదందా!
దుకాణాలు, రోడ్ సైడ్ చిల్లర వర్తకుల వద్దకు వెళ్లి ముక్కుపిండి మామూళ్లు వసూలు చేసే రౌడీ మూకలను మనం సినిమాల్లోనే చూసి ఉంటాం. అయితే ఇటీవల తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాల తూటాలకు హతమైపోయిన గ్యాంగ్ స్టర్ నయీమ్ సాగించిన నయా దందాలో సినిమా తరహాలో కొత్త దందా వెలుగుచూసింది. తన సొంత జిల్లా నల్లగొండలో వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేసిన నయీమ్ వారి నుంచి నెలనెలా పన్నులు వసూలు చేసేవాడట. నయీమ్ హత్య అనంతరం అతడి చీకటి వ్యాపారాల గుట్టు విప్పేందుకు రంగంలోకి దిగిన సిట్ అధికారుల దర్యాప్తులో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. బడా రాజకీయ వేత్తలను బెదిరింపులకు గురి చేసిన నయీమ్ పేరు చెబితేనే వణికిపోయిన వ్యాపారులు అతడు అడిగిన మేరకు కప్పం కట్టేవారట. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఈ నయాదందాను పోలీసులు ‘నయీమ్ ట్యాక్స్’గా పిలుస్తున్నారు.