: ప్రముఖ నటి నర్గిస్ ఫక్రీ క్రెడిట్ కార్డు క్లోనింగ్.. అకౌంట్ నుంచి రూ.6 లక్షలు మాయం
బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి, మోడల్ నర్గీస్ ఫక్రీ క్రెడిట్ కార్డు అమెరికాలో క్లోనింగ్‌కు గురైంది. ఆమె కార్డును క్లోనింగ్ చేసిన దుండగులు నర్గీస్ అకౌంట్ నుంచి రూ.6 లక్షల లావాదేవీలు జరిపారు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్టు తన ఫోన్‌కు మెసేజ్‌లు రావడంతో ఆమె లబోదిబోమంటూ ముంబై పోలీసులను ఆశ్రయించింది. ఆ వెంటనే బ్యాంకు అధికారులకు ఫోన్ చేసి తన కార్డును బ్లాక్ చేయించుకుందీ చెక్-పాకిస్థానీ సంతతి చిన్నది. తన అకౌంట్ నుంచి సోమవారం ఉదయం మొత్తం 14 సార్లు లావాదేవీలు జరిగాయని, 9,062 డాలర్లు మాయమయ్యాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే క్లోనింగ్ కార్డులను నగదు తీసుకునేందుకు మాత్రమే ఉపయోగిస్తుంటారని, కానీ నర్గీస్ క్లోనింగ్ కార్డుతో షాపింగ్ చేసినట్టు గుర్తించినట్టు జుహు పోలీస్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ సునీల్ ఘోసాల్కర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.