: లాయర్ల ఖర్చు భరించే శక్తి లేదు, నన్ను జైల్లో పెట్టండి.. ప్రత్యేక కోర్టును వేడుకున్న బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి


పలు బొగ్గు కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న సంగతి తెలిసిందే. అయితే లాయర్ల ఖర్చు భరించలేకపోతున్నానని, తనకిచ్చిన బెయిల్‌ను రద్దు చేసి తిరిగి తనను జైల్లో పెట్టాలంటూ మంగళవారం ప్రత్యేక కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. జైలులో నుంచే విచారణను ఎదుర్కొంటానని కోర్టుకు తెలిపారు. ఆయన దరఖాస్తు చూసిన న్యాయస్థానం ఆశ్చర్యపోయింది. మరోసారి ఆలోచించాలని సూచించింది. కావాలంటే న్యూఢిల్లీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారటీ నుంచి కానీ, అమికస్ క్యూరీ నుంచి కానీ అడ్వకేట్లను నియమిస్తామని పేర్కొంది. కోర్టు ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. లాయర్ల ఖర్చును భరించడం తనకు తలకుమించిన భారంగా మారిందని, దయచేసి తనకు మంజూరు చేసిన బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయాలని మరోమారు కోరడంతో కోర్టు ఈ కేసును బుధవారానికి (నేటికి) వాయిదా వేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన కమల్ స్పాంజ్ స్టీల్ అండ్ పవరల్ లిమిటెడ్ (కేఎస్ఎస్‌పీఎల్), ఇతర కంపెనీల్లో జరిగిన బొగ్గు కుంభకోణంలో గుప్తా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ కేసు సాక్ష్యాధారాల నమోదు స్థాయిలో ఉంది. దీంతో కోర్టు గుప్తా సహా అప్పటి జాయింట్ సెక్రటరీ కేఎస్ క్రోపా, అప్పటి డైరెక్టర్ కేసీ సమారియా, ఇద్దరు కేఎస్ఎస్‌పీఎల్ అధికారులకు బెయిల్ మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News