: ఆ గొప్పదనం పిల్లాడిదా? తల్లిదండ్రులదా?
కొంతమంది పిల్లలు చిన్నప్పుడే పెద్దరికాన్ని ప్రదర్శిస్తారు. తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి వాళ్లలో నిజాయతీ అలవడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పిల్లాడు కూడా ఆ బాపతే. స్కాట్లాండ్ కు చెందిన డేనియల్ అనే చిన్నారి చూపిన సంస్కారం ఇప్పుడు అందర్నీ కట్టిపడేసింది. డేనియల్ ఓ రోజు తన తల్లితో కలిసి వైట్లీ విండ్‌ఫార్మ్ విజిటర్ సెంటర్ కు షాపింగ్ కు వెళ్లాడు. అక్కడ తనకు నచ్చిన బొమ్మను తీసుకుని ఇంటికెళ్లాడు. ఇంటికెళ్లిన తరువాత ఆ బొమ్మకి తన తల్లి డబ్బులు కట్టలేదని తెలిసింది. దీంతో ఆ చిన్నారి తెగ ఫీలయైపోయాడు. వెంటనే ఆ షాపుకు స్వదస్తూరీతో ఓ లేఖను రాస్తూ, ఆ బొమ్మను పార్శిల్ చేశాడు. ‘డియర్ సర్/మేడమ్.. నీను షాపులో నుంచి ఓ బొమ్మను తీసుకున్నాను. మా అమ్మ డబ్బు చెల్లించిందని అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తూ ఆమె ఈ బొమ్మకు డబ్బులు చెల్లించలేదు. కాబట్టి ఐటమ్ ను తిరిగి పంపిస్తున్నాను’ అని పేర్కొన్నాడు. బాబు సంస్కారానికి, నిజాయతీకి ముచ్చటపడిన వైట్లీ విండ్‌ఫార్మ్ విజిటర్ సెంటర్ మేనేజర్ అయాన్ పార్కిన్సన్ ఆ పిల్లాడి ఆచూకీ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, చాలా మంది కస్టమర్ల నుంచి తమ సర్వీస్ పై స్పందనలు వస్తుంటాయన్నారు. అయితే ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ చోటుచేసుకోలేదని తెలిపారు. డేనియల్ మళ్లీ తన తల్లితో కలిసి షాపింగ్ కు వస్తాడని భావిస్తున్నామని, అతనిని తప్పక కలుసుకుని అభినందిస్తామని ఆయన చెప్పారు.