: మార్కెట్ అప్ డేట్స్: ఆరంభంలోని లాభాలు అమ్మకాల ఒత్తిడితో ఆవిరి!


బలహీనంగా ఉన్న ఆసియా మార్కెట్లు, ద్రవ్యోల్బణం పెరిగిందని ముందస్తుగానే అందిన సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను కుంగదీసిన వేళ, సెషన్ ఆరంభంలోని లాభాలు, ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన అమ్మకాల ఒత్తిడితో నష్టాలుగా మారాయి. దీనికితోడు శుక్రవారం నాడు విడుదల కానున్న ఐఐపీ గణాంకాలు ట్రేడింగ్ మూడ్ ను దెబ్బతీశాయని నిపుణులు వ్యాఖ్యానించారు. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 30 పాయింట్లు లాభంలోకి వెళ్లిన బెంచ్ మార్క్ సూచిక 11 గంటల సమయంలో ఒక్కసారిగా ఒత్తిడికి గురైంది. 12 గంటల సమయానికి 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆ తరువాత కొద్దిగా కొనుగోలు మద్దతు లభించినా, అది నష్టాన్ని మాత్రం పూడ్చలేకపోయింది. మంగళవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 87.79 పాయింట్లు పడిపోయి 0.31 శాతం నష్టంతో 28,064.61 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 29.60 పాయింట్లు నష్టపోయి 0.34 శాతం నష్టంతో 8,642.55 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.55 శాతం లాభపడగా, స్మాల్ కాప్ 0.01 శాతం నష్టపోయింది. ఇక ఎన్ఎస్ఈ-50లో 22 కంపెనీలు లాభపడ్డాయి. సిప్లా, అదానీ మోటార్స్, హిందాల్కో, బీపీసీఎల్, అంబుజా సిమెంట్స్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఇన్ ఫ్రాటెల్, బోష్ లిమిటెడ్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,893 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,110 కంపెనీలు లాభాలను, 1,614 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,08,75,154 కోట్లుగా నమోదైంది.

  • Loading...

More Telugu News