: 25 నెలలు గడుస్తున్నా ఇంకా మూడో విడత రుణమాఫీ విడుదల కాలేదు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతుల గర్జన సభ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని అన్నారని పేర్కొన్నారు. ఆ తరువాత అదీ వీలుకాదని నాలుగు దఫాలుగా రుణమాఫీ చేస్తామన్నారని విమర్శించారు. 25 నెలలు గడుస్తున్నా ఇంకా మూడో విడత రుణమాఫీ విడుదల కాలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతుల వెంటే ఉందని, వారి పక్షాన పోరాడుతుందని అన్నారు. టీఆర్ఎస్ నేతలు అధికారంలోకి రాగానే రుణమాఫీపై మాట మార్చారని ఆయన విమర్శించారు. రుణమాఫీ పేరుతో ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. మిగతా పథకాలు ఆపేసి ఒకేసారి పూర్తి రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పత్తిరైతులకు రాష్ట్ర సర్కారు కన్నీరు మిగిల్చిందని అన్నారు. తెలంగాణలో లక్షలాది మంది పత్తి రైతులు ఉన్నారని, వారు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా రైతులు 50 క్వింటాళ్ల పత్తి పండిస్తున్నారని, పది లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోందని పేర్కొన్నారు. వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.