: విశాఖకు విస్తరించిన నయీమ్ దందా... రైల్వే శాఖ సీసీ ఫుటేజ్ లు కోరిన సిట్
గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆగడాలు విశాఖకూ విస్తరించాయి. రాష్ట్రం విడిపోయిన తరువాత, విశాఖలో భూముల ధరలు ఆకాశాన్ని తాకగా, అక్కడ దందాలు చేసేందుకు పలుమార్లు నయీమ్, తన అనుచరులతో కలసి విశాఖకు ప్రయాణించాడని కేసును విచారిస్తున్న సిట్ అధికారులు గుర్తించారు. విశాఖకు వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా రైల్లోనే ప్రయాణించేవాడని గుర్తించిన సిట్, సికింద్రాబాద్, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలోని సీసీ ఫుటేజ్ లన్నింటినీ పరిశీలించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మొత్తం సీసీ కెమెరాల దృశ్యాల రికార్డులను తమకు అప్పగించాలని సిట్ బృందం రైల్వే శాఖను కోరింది. గడచిన ఆరు నెలల వ్యవధిలో పలుమార్లు విశాఖకు వెళ్లి వచ్చిన నయీమ్, అక్కడ చేసిన భూ దందాలపై విచారణ వేగవంతం చేయాలని, అందుకు ఏపీ పోలీసులు, విశాఖ పోలీసుల సహకారం తీసుకోవాలని సిట్ నిర్ణయించింది. విశాఖలో నయీమ్ ఎవరెవరిని కలిశాడు? ఎవరిని అనుచరులుగా నియమించుకున్నాడన్న విషయాలపై తొలుత విచారించాలని అధికారులు భావిస్తున్నారు.