: ఉత్తరప్రదేశ్లో ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన రైళ్లు... తప్పిన ఘోరప్రమాదం
రెండు రైళ్ల డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించడంతో ఉత్తరప్రదేశ్లో ఘోరప్రమాదం తప్పింది. చర్బాంగ్ రైల్వే స్టేషన్కు సరిగ్గా రెండు కిలో మీటర్ల దూరంలో దిల్ఖుషా క్యాబిన్ ఏరియా వద్ద ఒకే ట్రాక్పై ఎదురెదురుగా రెండు రైళ్లు వేగంగా వచ్చాయి. గమనించిన ఇరు డ్రైవర్లు రైళ్లను ఆపేశారు. కేవలం 150 మీటర్ల దూరంలో రెండు రైళ్లు ఆగిపోయాయి. దీంతో రైళ్లలోని ఎంతో మంది ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్లు రైళ్లను ఆపకపోతే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది. సాంకేతిక లోపం వల్లే ఇరు రైళ్లు ఇకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. దిల్ ఖుషా క్యాబిన్ వద్దే రెండు రైళ్ల ట్రాక్‌లు మారాల్సి ఉందని, సిబ్బంది ట్రాక్ మార్చే ప్రయత్నం చేసినప్పటికీ సాంకేతిక లోపం వల్ల విఫలమయ్యారని పేర్కొన్నారు. రెండు రైళ్ల డ్రైవర్లు అత్యవసర బ్రేక్లు వేయడంతో పెనుప్రమాదం తప్పిందని చెప్పారు. పట్టాలపై భారీ శబ్దం చేస్తూ రైళ్లు ఆగిపోయాయని చెప్పారు.