: ఐదేళ్లలో మహారాష్ట్రను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతా.. అదే తన లక్ష్యమన్న బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్
వచ్చే ఐదేళ్లలో మహారాష్ట్రలో నీటి సమస్య అనేదే లేకుండా కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్(51) అన్నారు. ‘సత్యమేవ జయతే వాటర్ కప్ అవార్డ్స్ 2016’ కార్యక్రమంలో భార్య కిరణ్ రావు, ‘సత్యమేవ జయతే టీం’తో కలిసి పాల్గొన్న ఆమిర్ మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో మహారాష్ట్ర నుంచి కరవును తరమికొడతామన్నారు. అదే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. ‘‘ఐదేళ్లలో మహారాష్ట్రను కరవు రహిత రాష్ట్రంగా చేయాలన్నదే నా లక్ష్యం. నీటి సమస్యపై పోరాడే మంచి ముఖ్యమంత్రి కూడా రాష్ట్రానికి దొరికారు. ఆయన రాజకీయ సంకల్పం చాలా దృఢంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ మాట్లాడుతూ ఆమిర్‌ఖాన్ రీల్ హీరో కాదని, రియల్ లైఫ్‌లోనూ హీరోనేనని కొనియాడారు. కరవును తరిమికొట్టడంలో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఆమిర్‌ఖాన్ సత్యమేవ జయతే టీవీ టీం ‘పానీ ఫౌండేషన్’ను స్థాపించి వాటర్ హార్వెస్టింగ్‌పై ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ పోటీలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ గ్రామాలు చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించి ‘సత్యమేవ జయతే వాటర్ కప్ 2016’ అవార్డులు అందిస్తుంది. వాటర్ హార్వెస్టింగ్‌పై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఏప్రిల్ 20 నుంచి జూన్ 5 వరకు ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం విజేత గ్రామాలకు బహుమతులు అందించారు. కోరేగాం తహశీల్‌లోని వేలు గ్రామం మొదటి బహుమతిగా రూ.50 లక్షలు అందుకోగా, రెండో బహుమతి కింద రూ.30 లక్షలను ఖపర్టోన్, జైగాం గ్రామాలు సంయుక్తంగా అందుకున్నాయి. అంబెజిగై తహశీల్‌లోని రాడి తండా, వరుద్ తహశీల్‌లోని వతోడాలు మూడో బహుమతిగా రూ.20 లక్షలను సంయుక్తంగా అందుకున్నాయి. మొదటి విడత పోటీల్లో భాగంగా మూడు జిల్లాలను భాగస్వామ్యం చేయగా మలివిడతలో 30 జిల్లాలను భాగస్వామ్యం చేయనున్నట్టు ఆమిర్‌ఖాన్ తెలిపారు.