: చుట్టూ తుపాకులతో యువతులు... కనుసైగలతోనే బెదిరింపులు: పోలీసులకు నయీమ్ బాధితుడి ఫిర్యాదు


నయీమ్ ఎవరినైనా తన డెన్ కు తీసుకు వెళ్లి బెదిరిస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజెబుతూ ఓ బాధితుడు పోలీసులకు స్వయంగా ఫిర్యాదు ఇచ్చాడు. అతని పేరు వెల్లడించకుండా, ఇచ్చిన ఫిర్యాదు వివరాలను పోలీసు వర్గాలు వెల్లడించాయి. నయీమ్ చుట్టూ 20 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలు ఆయుధాలతో ఉన్నారు. నయీమ్ డెన్ లో నాలుగు గంటల పాటు బాధితుడికి నరకయాతన చూపారు. అతనిని నయీమ్ బెదిరిస్తున్నంత సేపూ వెనుక ఓ యువతి తుపాకితో నిలిచివుంది. నయీమ్ డిమాండ్ చేస్తున్నంత డబ్బు ఇచ్చుకోలేనని అతని కాళ్లు పట్టుకునేందుకు ముందుకు జరిగినప్పుడల్లా, ఆమె అడ్డుకుంది. నయీమ్ ను తాకనివ్వకుండా కళ్లతోనే బెదిరించింది. సైగలతో హెచ్చరించింది. కాగా, నయీమ్ వద్ద మహిళా సైన్యంలో ముంబై నుంచి వచ్చిన వారు అధికంగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. వీరికి ఆయుధాలు వాడటంలో శిక్షణ ఇప్పించిన నయీమ్, కొన్ని సెటిల్ మెంట్లకు వారినే పంపేవాడు. హత్యలు చేసేందుకు వారిని వాడుకున్నాడు. ఎవరినైనా ట్రాప్ చేయాలంటే, అందంగా ఉన్న వారిని ఎంచుకుని పంపేవాడు. హత్యలు చేయించిన తరువాత, అనుమానం రాకుండా, ఓ యువతిని పోలీసు స్టేషన్ లో లొంగిపోయేలా చూసి, ఆపై ఆమెను బెయిల్ మీద బయటకు తెచ్చిన సందర్భాలూ ఉన్నాయని పోలీసులు గుర్తించారు. కోనపురి రాములు హత్యోదంతంలో ఇదే జరిగిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News