: మరణించే ముందు తొమ్మిదేళ్ల కొడుకుకు సినీ గేయ రచయిత ముత్తుకుమార్ లేఖ... భావోద్వేగానికి గురి చేస్తూ వైరల్!
ముత్తుకుమార్... ప్రముఖ గీత రచయితగా పేరు తెచ్చుకుని కామెర్ల వ్యాధి సోకి ఆదివారం నాడు మరణించగా, తన మరణాన్ని ముందే ఊహించిన ఆయన, తొమ్మిదేళ్ల కుమారుడికి ముందే లేఖ రాశారు. ఇప్పుడా లేక సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ చదివిన వారందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది. ఆ లేఖలో ఏముందంటే... ప్రియమైన కుమారుడికి... నాన్న రాస్తున్న తొలి లేఖ ఇది. దీన్ని పూర్తిగా అర్థం చేసుకునే వయసు నీకు లేదు. ఇంకా నా వేలు పట్టుకునే నడుస్తున్నావ్. నా చిన్నప్పుడు మా నాన్న నా వద్ద నుంచి దాచి పెట్టిన రహస్యాల పెట్టె తాళాన్ని నేను వెతుక్కున్నట్టే, నువ్వూ వెతకాలి. చాలా జాగ్రత్తగా జీవితపు అడుగులు వేయాలి. ప్రయాణాలు ఎక్కువ చేయాలి. అవే నీకు విలువైన అనుభవాలు అవుతాయి. పుస్తకాలను ప్రేమించు. ఒక్కోటి ఒక్కో అనుభవాన్ని అందిస్తుంది. నీ తాతయ్య, నీ నాన్న పుస్తకాలే ప్రపంచంగా గడిపి కనుమరుగు అయ్యారు. నీ రక్తంలోనూ అదే నది ప్రవహిస్తూ ఉంటుంది. దక్కిన పని కన్నా, నచ్చిన పని చేస్తూ సాగు. అందమైన జీవితం ఉంటుంది. సాయం కోరిన వారికి అప్పు చేసైనా సహాయపడు. ఆ ఆనందం అపురూపం. బంధువులను ఎక్కడుంచాలో అక్కడ ఉంచు. వారితో స్నేహంగానూ, దూరంగానూ ఉండాలి. స్నేహం అన్నింటికన్నా విలువైనది. మంచి ఫ్రెండ్స్ ను సంపాదించుకో. జీవితంలో మంచి దారి ఏర్పడుతుంది. ఈ విషయాలన్నీ మా నాన్న నాకు చెప్పకుండా చెప్పినవే. వాటినే నేను నీకు చెబుతున్నాను. నువ్వు పుట్టిన తరువాతే మా నాన్న ప్రేమ, అనురాగం ఎలాంటివో తెలిశాయి. నువ్వు పెద్దవాడివై నీకో కొడుకు పుడితే, నేను చూపిన ప్రేమ ఏంటో తెలుస్తుంది. భవిష్యత్తులో నీ మనవళ్లతో నవ్వుతూ మాట్లాడుతున్న వేళ, నేను గుర్తుకు వస్తే, ఈ లెటర్ తీసి చదువుకో. నీ కంటి నుంచి వచ్చే చుక్క నీటిలో నేను ఉంటా... ఇట్లు, మీ నాన్న, ముత్తుకుమార్.