: అధికారితో షూలేసు కట్టించుకున్న మంత్రి... నేను వీఐపీని అన్న అమాత్యుడు
స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఒడిశాలోని ఓ అమాత్యుడు తన వ్యక్తిగత భద్రతాధికారి (పీఎస్‌వో)తో షూ లేసు కట్టించుకున్న ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విమర్శల దాడిపై స్పందించిన మంత్రి ‘నేను వీఐపీని’ అని చెప్పడం గమనార్హం. కియోంజర్‌లోని హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖా మంత్రి జోగేంద్ర బెహరా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం షూ తొడుక్కుంటున్న సమయంలో ఆయన పీఎస్‌వో మంత్రి షూలేసును కట్టడం వీడియోలో కనిపించింది. ఇది స్థానిక మీడియాలో ప్రసారం కావడంతో మంత్రిపై పలువురు భగ్గుమన్నారు. ఇది బ్రిటిష్ మనస్తత్వానికి ప్రత్యక్ష నిదర్శనమని విరుచుకుపడ్డారు. విమర్శలపై స్పందించిన మంత్రి తానో వీఐపీనని, జెండా ఎగురవేసింది తానే కానీ పీఎస్‌వో కాదని పేర్కొనడం గమనార్హం. ఈ విషయంలో ప్రభుత్వం తరపు నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.