: దాయాదుల మధ్య మాటల యద్ధం... పాక్ వెన్నులో వణుకు పుట్టించిన మోదీ వ్యాఖ్యలు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగం పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పాక్‌లో మానవహక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడిన ప్రధాని పాక్‌కు హెచ్చరికలు పంపారు. బలూచిస్థాన్, గిల్గిత్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో మానవహక్కుల ఉల్లంఘన తారస్థాయికి చేరుకుందని మోదీ పేర్కొనడంతో షాక్ తిన్న పాకిస్థాన్ యథావిధిగా మాటల యుద్ధానికి తెరలేపింది. బలూచిస్థాన్‌ను భారత్ ప్రస్తావించి కశ్మీర్ అంశం నుంచి ప్రపంచం దృష్టిని మరలించేందుకు ప్రయత్నిస్తోందంటూ అక్కసు వెళ్లగక్కింది. బలూచిస్థాన్‌లో భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పేందుకు మోదీ ప్రసంగం చక్కని ఉదాహరణ అని పేర్కొంది. బలూచిస్థాన్‌కు, కశ్మీర్‌కు ఏమాత్రం పోలిక లేదని పేర్కొన్న పాక్ విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ బలూచిస్థాన్ పాక్ అంతర్భాగమని పేర్కొన్నారు. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘రా’ సాయంతో అక్కడ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాగా ముందస్తు వ్యూహంలో భాగంగానే మోదీ బలూచిస్థాన్ పేరును తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎర్రకోట సాక్షిగా బలూచిస్థాన్ పేరును ప్రస్తావించి తమ కష్టాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లిన మోదీకి బలూచి నేతలు బ్రహ్మరథం పడుతున్నారు. జైహింద్ అంటూ నినదిస్తున్నారు. దీంతో దిక్కుతోచని పాకిస్థాన్ తన సహజసిద్ధమైన శైలిలో భారత్‌పై మాటల దాడికి దిగింది.