: మేము ఊహించిన దానికంటే చంద్రబాబు ఎక్కువే ఇచ్చారు: పరిటాల సునీత
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊహించిన దానికంటే ఎక్కువ వరాలు ఇచ్చారని పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురంలో ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని పేరూరు ప్రాజెక్టుకు 850 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు స్వాతంత్ర్యదినోత్సవం రోజున ప్రకటించి రైతుల్లో ఆనందం నింపారని ఆమె అన్నారు. ఈ ప్రాజెక్టుతో 6 మండలాల రైతులకు ప్రయోజనం కలుగుతుందని ఆమె తెలిపారు. కాగా, అనంతపురంలో నిర్వహించిన స్వాతంత్య్రదిన వేడుకలను పురస్కరించుకుని 6,554 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో కరవు నివారణ, వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు పేరూరు ప్రాజెక్టుకు 850 కోట్ల రూపాయలు కేటాయించారు.