: ఏపీలో స్వాతంత్ర్యం ఎక్కడ?: ప్రశ్నించిన జగన్


చంద్రబాబునాయుడి పాలనలో ప్రజలకు స్వాతంత్ర్యం లేకుండా పోయిందని, దళితులపై దాడులు జరగడం తన మనసును కలచి వేసిందని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన ప్రసంగించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలైన తరువాత కూడా దాడులు జరుగుతున్నాయంటే, ఇక స్వాతంత్ర్యం ఎక్కడ వచ్చినట్లని ఆయన ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లాలో చనిపోయిన ఆవు చర్మాన్ని తీసుకెళుతున్న వారిపై నిర్దయగా దాడి చేసిన ఘటనను ప్రస్తావిస్తూ, కులం, మతం ఆధారంగా మనుషులను విడదీసే భావన నశించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. పాలకులు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయని, అనంతపురంలో చంద్రబాబు ప్రసంగం వాస్తవానికి ఎంతో దూరంగా ఉందని జగన్ ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, రాజ్యాంగాన్ని వెటకారం చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆయన విమర్శించారు. కళ్ల ముందు నల్లధనంతో ప్రజా ప్రతినిధులను కొంటూ అడ్డంగా దొరికిపోయినా, ఏమీ చేయలేని పరిస్థితి ఉందంటే, పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఆలోచించాలని ప్రజలను కోరారు. వ్యవస్థలో మార్పు రావాల్సి వుందని, ప్రజలు నిజానిజాలను ఆలోచించాలని కోరారు. రెండు గంటలపాటు ప్రసంగించిన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లోకి పెడుతున్నట్టు స్వయంగా అంగీకరించారని జగన్ ఎద్దేవా చేశారు. 920 కి.మీ తీర ప్రాంతాన్ని సింగపూర్ కంపెనీలకు, విలువైన అమరావతి ప్రాంతాన్ని చైనా కంపెనీలకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News