: అమరావతిలో విలాస భవనాలు కావాలని ఒత్తిడి తెస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు
అమరావతి సీడ్ క్యాపిటల్ లో విలాసవంతమైన భవనాలు కావాలని, 150 ఎకరాలను తమకు కేటాయించి విల్లాలను నిర్మించి ఈ ప్రాంతాన్ని 'పోష్ లొకాలిటీ'గా మార్చాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలు సీఆర్డీఏ (కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ)పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలతో పాటు కొందరు మంత్రులు కూడా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రస్తావించి, హై ఎండ్ విల్లాలను ఎమ్మెల్యేల కోసం నిర్మించాలని గట్టిగానే కోరినట్టు సమాచారం. కాగా, అమరావతి మాస్టర్ ప్లాన్ లో ప్రధాన వాణిజ్య ప్రాంతంగా ఉద్దండరాయుని పాలెం ప్రాంతాన్ని ఎంపిక చేయగా, ఇదే ప్రాంతంలో మెట్రో రైల్ నెట్ వర్క్, వేలాది ఉద్యోగాలు కల్పించే ప్రధాన వ్యాపార కేంద్రాలు ఏర్పడనున్నాయి. ఇదే ప్రాంతంలో తమకు నివాస గృహాలను విలాసవంతంగా నిర్మించి ఇవ్వడం ద్వారా, మరిన్ని పెట్టుబడులను ఆహ్వానించ వచ్చని ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. "సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో సవివరణాత్మక మాస్టర్ ప్లాన్ ను స్విస్ చాలెంజ్ పద్ధతిలో కాంట్రాక్టు గెలుచుకున్న కంపెనీ అందిస్తుంది. ఈ ప్రాంతంలో అత్యాధునిక భవంతుల సముదాయం నిర్మితమైతే అది రాజధానికే తలమానికం అవుతుంది" అని మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కాంప్లెక్స్, నగరానికి గేట్ వే, సాంస్కృతిక సెంటర్లు, కన్వెన్షన్ హాల్ తదితరాలు సీడ్ క్యాపిటల్ లో రానున్నాయి. ఇక్కడ విలాసవంతమైన ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు టీడీపీ ఎమ్మెల్యేల నుంచి ముఖ్యంగా గుంటూరు ప్రాంత నేతల నుంచి మద్దతు అధికంగా లభిస్తున్నట్టు సమాచారం. "ప్రతి నగరానికి ఓ విలాసవంతమైన ప్రాంతం ఉంటుంది. అమరావతికి అలాంటి ప్రాంతం లేదు. కాబట్టే మేమిలా అడుగుతున్నాం" అని గుంటూరు జిల్లా నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.