: నీ పరుగుకు నేను ఫిదా!... ‘జమైకా చిరుత’ను ఆకాశానికెత్తేసిన కోహ్లీ!
టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ... యావత్తు క్రికెట్ ప్రపంచంలో అత్యంత సమర్ధుడైన బ్యాట్స్ మన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అతడికీ ఓ అభిమాన క్రీడాకారుడున్నాడు. మరి కోహ్లీ ఆరాధించే క్రీడాకారుడెవరో తెలుసా?... ఇంకెవరు, పరుగు పందెంలో కళ్లు మూసి తెరిచేలోగా లక్ష్యం చేరుకునే జమైకా చిరుత ఉసేన్ బోల్ట్. భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత రియో ఒలింపిక్స్ లో భాగంగా జరిగిన 100 మీటర్ల పరుగు పందెంలో 9.81 సెకన్ల వ్యవధిలోనే లక్ష్యం చేరి అత్యంత వేగంగా పరుగెత్తగల క్రీడాకారుడిగా బోల్డ్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. బోల్ట్ సామర్థ్యంపై నమ్మకముంచిన కోహ్లీ... రియోలో అతడి పరుగును ప్రత్యక్షంగా చూస్తానని ఇంతకుముందే ప్రకటించాడు. అనుకున్నట్లుగానే బుల్లెట్ లా దూసుకెళుతున్న బోల్డ్ రేసును కోహ్లీ లైవ్ టీవీలో వీక్షించాడు. ఈ సందర్భంగా బోల్ట్ పై అభిమానాన్ని చాటుకున్న కోహ్లీ... అతడి సత్తాను కీర్తిస్తూ ట్విట్టర్ లో ఆసక్తికర కామెంట్లు చేశాడు. ‘‘పరుగులో నువ్వు ఓ లెజెండ్ వి. రన్నింగ్ లో నీకు నువ్వే సాటి. నీ రికార్డులను ఎవరూ అధిగమించలేరు. నీ పరుగుకు నేను ఫిదా అయ్యాను’’ అంటూ కోహ్లీ సదరు ట్వీట్ లో బోల్ట్ ను ఆకాశానికెత్తేశాడు.