: నయీమ్ బంధువుల పేరిట లగ్జరీ విల్లాలు!... గుట్టలుగా బంగారం బిస్కట్లు, వజ్రాభరణాలు!
తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసుల బుల్లెట్లకు హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తోంది. ఇప్పటికే పోలీసుల సోదాల్లో నయామ్ కు చెందిన భారీ అక్రమాస్తులు వెలుగుచూశాయి. లెక్కకు మించిన నోట్ల కట్టలు, స్థిరాస్తి పత్రాలు, బంగారం, లక్షలాది రూపాయల ఖరీదైన వస్తువులను చూసి పోలీసులే షాక్ తిన్నారు. దీంతో ఈ వ్యవహారం మొత్తం గుట్టు విప్పేందుకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో మరింత మేర ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. సిట్ అధికారుల సోదాల్లో భాగంగా హైదరాబాదు పరిధిలో నయీమ్ తన బంధువుల పేరిట కొనుగోలు చేసిన అత్యంత విలాసవంతమైన విల్లాలు వెలుగుచూశాయి. వీటిని స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు... వాటిలో ముమ్మరంగా సోదాలు చేయగా భారీగా బంగారం బిస్కెట్లు, వజ్రాలు పొదిగిన ఖరీదైన ఆభరణాలు లభ్యమయ్యాయట.