: ‘మోదీ.. మోదీ’ అంటూ నినదించిన ముస్లింలు!... కారు దిగి మైనార్టీ వ్యక్తికి ప్రధాని ఆలింగనం!
ఆరెస్సెస్ భావజాలంతోనే రాజకీయ రంగప్రవేశం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై హిందూత్వ వాది అన్న ముద్ర ఉంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలు ఆయనను హిందూత్వ వాదిగానే ప్రచారం చేశాయి. తద్వారా మైనారిటీ వర్గాల ఓట్లను కొల్లగొట్టాలని చూశాయి. అయితే ఆ పార్టీల ప్రయత్నాలు ఏమాత్రం ఫలించిన దాఖలా కనిపించలేదు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ స్పష్టమైన మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. మోదీ మేనియాకు ఒక్క హిందువుల ఓట్లే కాకుండా ముస్లిం మైనారిటీ వర్గాలు సహా అన్ని వర్గాల ఓట్లూ పడ్డాయి. హిందూత్వ వాదిగా ముద్రపడిన మోదీకి ముస్లింలు ఎలా ఓట్లేస్తారన్న ప్రశ్నలపై నాడు పెద్ద ఎత్తున విశ్లేషణలే జరిగాయి. నాడు ఆ విశ్లేషణలు ఈ విషయానికి సమాధానం చెప్పలేకపోయాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశం మాత్రం ఆ ప్రశ్నలకు చక్కటి సమాధానం చెప్పింది. వివరాల్లోకెళితే... మధ్యప్రదేశ్ లోని భద్ర గ్రామంలో ఇటీవల మోదీ పర్యటించారు. స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ స్వగ్రామమైన ఆ ఊరిలో మోదీ రాక కోసం ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ప్రజలంతా వేచి చూశారు. ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చిన వారంతా రోడ్డుకు ఓ పక్కగా నిలిచి మోదీ రాక కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో మోదీ కాన్వాయ్ రానే వచ్చింది. ఇంకేముంది... తమ అభిమాన రాజకీయ నేత రాగానే వారంతా ‘మోదీ... మోదీ... మోదీ’’ అని పెద్ద పెట్టున నినదించారు. అంతేకాకుండా మోదీ ప్రయాణిస్తున్న కారు వద్దకు చొచ్చుకువెళ్లారు. ఇదంతా కారులో కూర్చునే సాంతం పరిశీలించిన మోదీ... తన కారును ఆపివేయించి అక్కడికక్కడే కారు దిగిపోయారు. తనకు సమీపంలో ఉన్న ఓ ముస్లిం మైనారిటీ వ్యక్తిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. భద్రతను పక్కనపెట్టేసి తన వద్దకు వచ్చిన ముస్లిం మైనారిటీలకు ఈ తరహాలో మోదీ స్వాగతం పలికితే... ఓట్లెందుకు పడవంటూ జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా సదరు వీడియోను జాతీయ మీడియా బాగానే ప్రసారం చేస్తోంది.